గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ మెరుపు దాడులు
2.10 క్వింటాళ్ల నల్ల బెల్లం, 54 లీటర్ల గుడుంబా స్వాధీనం
16 మందిపై కేసుల నమోదు
నమస్తే భారత్ :-తొర్రూరు
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీకి వినియోగించే పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కే. నవీన్ కుమార్, ఏ ఈ ఎస్ బ్రహ్మానంద రెడ్డి, ట్రైనీ ఏ ఈ ఎస్ వి. లక్ష్మణ్ ఆనంద్, తొర్రూరు ఎక్సైజ్ సీఐ బూస అశోక్ లతో పాటు పలువురు అధికారులు తొర్రూరు సర్కిల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో పాల్గొన్నారు.ఎక్సైజ్ సీఐ బూస అశోక్ తెలిపిన వివరాల మేరకు…విశ్వసనీయ సమాచారం మేరకు డివిజన్ పరిధిలోని అమర్ సింగ్ తండా, దుబ్బ తండా కోట్యా తండా, భీముడు తండా, సామ్య తండా, రత్తి రామ్ తండా, తారా సింగ్ బావి తండా, శంకర్ నాయక్ తండ, సాండియా తండాలలో ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు గుడుంబా స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 54 లీటర్ల నాటుసారా, 2.10 క్వింటాళ్ల నల్ల బెల్లం, 2000 లీటర్ల బెల్లం పానకం, 20 కిలోల పట్టిక, 50 కిలోల చక్కెర, 500 గ్రాముల ఈస్ట్ పౌడర్ లతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 16 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు,13 మందిని తహసిల్దారుల ఎదుట బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ….సారా తయారీకి వినియోగించే బెల్లం, ఇతర ముడి పదార్థాల క్రయవిక్రయాలు, రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడుంబా కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని, సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని, జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, గుడుంబా నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ హరి, టాస్క్ ఫోర్స్ ఆర్. రంగనాథ్, ఎక్సైజ్ ఎస్సై ఆర్. రంగనాథ్,ఎస్సైలు మహేందర్, కరుణాకర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



