ఓటర్ల జాబితా సవరణలో ఇంటింటికీ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వేగవంతం

-యాద్గార్‌పల్లిలో సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
-బీఎల్‌వోల పనితీరుపై క్షేత్రస్థాయిలో ఆరా
-పత్రాల పంపిణీ అనంతరం తప్పనిసరిగా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశం
-క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ నమోదు ప్రక్రియపై అధికారుల వివరణ
కుత్బుల్లాపూర్, జూన్ 27 ( నమస్తే భరత్ ): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కీసర మండలం యాద్గార్‌పల్లిలో శనివారం చేపట్టిన ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ తీరును పరిశీలించిన ఆయన, ఒక్కో కుటుంబానికి ఎన్ని పత్రాలు అందిస్తున్నారో, వాటి వివరాలను యాప్‌లో ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
బీఎల్‌వోలు స్పందిస్తూ, ప్రతి అర్హ ఓటరికి రెండు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నామని, అనంతరం సెల్‌ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ ఆధారంగా వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు.
దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పత్రాల పంపిణీ పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలను తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కీసర తహసీల్దార్ యాదగిరి రెడ్డి, ఆర్‌ఐ మహేందర్, బీఎల్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



