సూరారం చౌరస్తాలో పైప్‌లైన్ పనుల జాప్యం.. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు

మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు
“ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పనులు వెంటనే పూర్తి చేయాలి” — కోల రవీందర్ ముదిరాజ్
ఉద్యోగులు, విద్యార్థులకు పెరుగుతున్న ట్రాఫిక్ తిప్పలు
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని పనులు వేగవంతం చేయాలని ప్రజల డిమాండ్
సూరారం, జూన్ 18 (విజన్ ఆంధ్ర):
బాలానగర్–నరసాపూర్ ప్రధాన రహదారిపై సూరారం చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైనేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా కొనసాగుతున్నప్పటికీ, పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై సామాజిక, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్, ట్రాఫిక్ ఏసీపీ, పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు పనులను పరిశీలించి వెళ్లినా పనుల వేగం మాత్రం పెరగలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారని, సాధారణంగా ఐదు నిమిషాల్లో చేరాల్సిన ప్రాంతాలకు ప్రస్తుతం 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు ప్రజల దైనందిన కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో వరద కాలువ నిర్మాణ పనుల వల్ల కూడా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ పైప్‌లైన్ పనుల జాప్యంతో అదే పరిస్థితి నెలకొనడం స్థానికులను నిరాశకు గురిచేస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, మూల సమస్య పరిష్కారం కాకపోవడంతో వారికి కూడా ఇది తలనొప్పిగా మారిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమయం వృథా కాకుండా తక్షణ చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

