ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: పట్లోళ్ల కార్తిక్ రెడ్డి
నమస్తే భరత్ నవంబర్ 10 గండిపేట్ రిపోర్టర్ శ్రీనివాస్ రాజేంద్రనగర్: మహిళా ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ జానయ్యకు వ్యతిరేకంగా, బాధిత ప్రొఫెసర్‌కు మద్దతుగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని రాజేంద్రనగర్ భారత రాష్ట్ర సమితి ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని, సిగ్గుచేటని అన్నారు. నిందితుడికి రక్షణ కల్పిస్తూ, బాధితురాలికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు.
నిరసన తెలపడం నేరమా?
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధిత ప్రొఫెసర్‌కు మద్దతుగా నిలుస్తున్న తమను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. బాధిత ప్రొఫెసర్‌కు న్యాయం జరిగే వరకు, వీసీ జానయ్యపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెస్టుల్లో పోరెడ్డి ధర్మారెడ్డి, ఎర్రోళ్ల యాదయ్య, సరికొండ దుర్గేష్, ఈ. నవీన్ కుమార్, కట్టెల మండి గౌతమ్, అఖిరానందన్ తదితరులు ఉన్నారు.



