ePaper
Friday, July 3, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి.

కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి.

📰 Generate e-Paper Clip

– కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి.

– 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన దుర్మార్గం.

– ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు.

– పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై లాఠీచార్జీ, అక్రమ అరెస్టులు.

– సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

*ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై02:తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాసంస్థలను పుస్తకాలు, యూనిఫాంలు, నోట్‌బుక్స్ విక్రయ కేంద్రాలుగా మార్చే విధానాన్ని నిలిపివేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు.ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. ఒకవైపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇస్తూ, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించడం ప్రభుత్వ విద్యకు గోరి కట్టడమేనని మండిపడ్డారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఇప్పటికీ అందించలేదని, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయలేదని, మధ్యాహ్న భోజన పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇప్పుడు పాఠశాలలను మూసివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, విద్యార్థులు లేరనే పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రతిపాదనలు సిద్ధం చేయడం ప్రజావ్యతిరేక విధానమని విమర్శించారు. సుమారు 10 వేల పాఠశాలలను మూసివేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, తాజాగా 27 వేల పాఠశాలలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని బయటపెడుతున్నాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే విధానంలోని రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కార్యక్రమాన్ని అమలు చేయడం బీజేపీ విధానాలకు అనుకూలంగా వ్యవహరించడమేనని విమర్శించారు.
తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రిస్తూ వాటిని బహిరంగంగా ప్రదర్శించే విధానాన్ని అమలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫీజుల దోపిడీపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లు, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ వంటి ప్రాథమిక వసతులు కల్పించలేదని తెలిపారు. వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులను కూడా శాశ్వతంగా భర్తీ చేయకుండా ఎఫ్‌ఏసీలతోనే కొనసాగిస్తున్నారని విమర్శించారు.మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థలకు అప్పగించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందడం లేదని అన్నారు. ప్రభుత్వం డిజిటల్ విద్య, ఫిన్లాండ్ విద్యా విధానం గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, అనేక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా లేవని, అలాంటప్పుడు నాణ్యమైన డిజిటల్ విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు.ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకు అందకుండా చేసే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరించింది.
ఆందోళన సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసులు పిడిగుద్దులు, లాఠీలతో దాడి చేశారని, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డిపై తీవ్రంగా లాఠీచార్జీ చేసి గాయపరిచారని తెలిపారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది.అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!