బాలామృతం కొత్త ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి


– నాచారం తెలంగాణ ఫుడ్స్‌లో ఆధునిక ప్లాంట్ ప్రారంభం
– గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
– 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పం
– పేదల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
– ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాల అమలు
– రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భారత్ ): నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ సంస్థలో ఏర్పాటు చేసిన నూతన బాలామృతం ఉత్పత్తి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం బాలామృతం తయారీ, ప్యాకింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గర్భిణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించిన కార్యక్రమం కాలక్రమేణా పరిశ్రమ స్థాయికి ఎదిగిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు ఆధునిక బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో తమ ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో మంజూరు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు రాష్ట్రంలోని కోట్లాది ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంత పేదల కోసం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అలాగే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును మహిళలకు అప్పగించామని వెల్లడించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు బాలామృతం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న ఆయన, పేద విద్యార్థులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. విద్య, ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని ప్రభుత్వం ఖర్చుగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తోందని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.



