మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి


నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా
రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్
ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి
జీహెచ్ఎంసీ తరహా వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
బాచుపల్లి, జూలై 7 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిజాంపేట్ సర్కిల్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ కమిషనర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు తక్కువ వేతనాలతో, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు తగిన గౌరవం, హక్కులు, సంక్షేమం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికులకు నెలకు రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు అమలులో ఉన్న వేతనాలు, సౌకర్యాలు, ప్రభుత్వ ఉత్తర్వులను నిజాంపేట్ సర్కిల్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు, షూస్, గ్లోవ్స్, సబ్బులు, నూనెలు, భద్రతా ఎప్రాన్లు, డ్రైనేజీ పనిముట్లు తదితర రక్షణ సామగ్రిని క్రమం తప్పకుండా అందించాలని డిమాండ్ చేశారు. ప్రగతి నగర్ నుంచి బాచుపల్లికి బదిలీ చేసిన కార్మికులను తిరిగి ప్రగతి నగర్‌కే నియమించాలని, ప్రతి కార్మికుడికి నిబంధనల ప్రకారం క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీలో అమలులో ఉన్న రూ.18,500 వేతనాన్ని నిజాంపేట్ సర్కిల్ కార్మికులకు కూడా వెంటనే అమలు చేయాలని, అధికారుల వేధింపులను నిలిపివేసి ఎనిమిది గంటల పని దినాన్ని కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పండుగ సెలవులు, మహిళా కార్మికులకు ప్రత్యేక సెలవులు, ఇతర సంక్షేమ ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, అధికారులు తక్షణమే పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు ఉన్ని కృష్ణ, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు రాథోడ్ సంతోష్, సీఐటీయూ మండల కమిటీ సభ్యుడు పి. భాస్కర్, నిజాంపేట్ సర్కిల్ మున్సిపల్ కార్యదర్శి పెంటయ్య, మండల కమిటీ సభ్యులు నరసింహ, లక్ష్మి, ఈశ్వరయ్య, నాగలక్ష్మి, రాములు, శ్రీను, నాగజ్యోతి, నాగ శేషు, తిరుపతి, మైపాల్‌తో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.



