వైద్యుల సేవలను సమాజం గుర్తించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు
వైద్యుల సేవలను సమాజం గుర్తించాలని, వారికి సమచిత గౌరవం కల్పించాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి
సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు తెలిపారు.జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైద్యులను సత్కరించారు.ఈ సందర్భంగా సూపరిటెండెంట్ తోటి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడే వైద్యుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. వైద్యుడు ప్రత్యక్ష దైవంతో సమానమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ వారు ఎంచుకున్న వృత్తిలో.విధులు.నిర్వర్తించేందుకు నిర్దిష్టమైన సమయం ఉంటుందని, వైద్యులకు మాత్రం అలాంటి వెసులుబాటు ఉండదన్నారు. అవసరాన్ని బట్టి 24 గంటలూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. వైద్య వృత్తికే జీవితాన్ని అంకితం చేసి సేవలందిస్తున్న వైద్యులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సత్కరించుకోవడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు నిత్యం ఎంతో మంది నిరుపేదలకు వైద్యసహాయం అందిస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో వైద్యులు వారి ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలు అందించడం వల్లనే వేలాది మంది.ప్రాణాలు.కాపాడుకోగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.రోగుల పట్ల మరింత సేవా దృక్పథంతో, అంకితభావంతో పనిచేసి వైద్య వృత్తికి వన్నె తీసుకురావాలని ఆయన తోటి వైద్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అలువాల విజయ్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ నందనా దేవి, డాక్టర్ మానస, డాక్టర్ ప్రియాంక , సేవా తరుణి ప్రతినిధులు డాక్టర్ శారద, రేణుక రెడ్డి, నిత్య, ఉమలు తదితరులు
పాల్గొన్నారు.



