జూలై 22 వరకు జర్నలిస్టుల బస్ పాస్‌లకు ఊరట

-పాత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు పొడిగింపు
-కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ పూర్తయ్యే వరకు ప్రత్యేక నిర్ణయం
-రాష్ట్ర, జిల్లా స్థాయి పాత్రికేయులందరికీ వర్తింపు
-జూలై 1 నుంచి 22 వరకు పాత బస్ పాస్‌లే చెల్లుబాటు
-టీజీఎస్ఆర్టీసీకి సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశాలు
కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పాత్రికేయులకు ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అమల్లో ఉన్న 2024–2026 అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ సమాచార, ప్రజాసంబంధాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్ పాస్‌లు కూడా అదే గడువు వరకు చెల్లుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డా. జి. ముకుంద రెడ్డి బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారిక లేఖ పంపారు. 2026–2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ కొనసాగుతున్నందున, పాత కార్డుల గడువును జూలై 22 వరకు పొడిగించినట్లు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా, జూలై 1 నుంచి జూలై 22 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు జారీ చేసిన పాత బస్ పాస్‌లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా యథావిధిగా అనుమతించాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులను కోరారు. అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగిసిందనే కారణంతో బస్ పాస్‌లను తిరస్కరించవద్దని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతులను తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజాసంబంధాల అధికారులకు పంపించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.



