ఫుట్‌పాత్ ఆక్రమణలకు చెక్.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎస్‌ఐ గండ్రాతి సతీష్ హెచ్చరిక

నమస్తే భారత్ :-మరిపెడ
ప్రజల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై మరిపెడ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జాతీయ రహదారి వెంట విస్తృతంగా తనిఖీలు చేపట్టి, రహదారి భద్రతకు భంగం కలిగించే ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డుపైకి విస్తరించిన దుకాణాలను గుర్తించి వెంటనే తొలగింపజేశారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, పాదచారులు సురక్షితంగా నడిచేలా ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించారు. వ్యాపారులు తమ వ్యాపారాలను దుకాణాల పరిమితుల్లోనే నిర్వహించాలని, రోడ్లపై వస్తువులు ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ గండ్రాతి సతీష్ మాట్లాడుతూ, పాదచారులకు ఫుట్‌పాత్‌పై నడిచే హక్కు ఉందని, ఆ మార్గాలను ఆక్రమించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. షాపుల ముందు ఫుట్‌పాత్‌లపై లేదా రహదారిపై అక్రమంగా వస్తువులు ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగితే, సంబంధిత దుకాణ యజమానులను కూడా బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం అవగాహన కల్పించే ఉద్దేశంతో మొదటి హెచ్చరిక మాత్రమే ఇస్తున్నామని, ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సౌకర్యం, ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ క్లియరెన్స్, రహదారి క్రమశిక్షణ, ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. సురక్షితమైన రహదారుల నిర్మాణానికి వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



