సమగ్ర ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలు కీలక భూమిక పోషించాలి

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై గాజులరామారంలో శిక్షణ
జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంపై అవగాహన
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని సూచన
పారదర్శకత, ఖచ్చితత్వంతో విధులు నిర్వర్తించాలని అధికారుల పిలుపు
గాజులరామారం, జూన్ 18 ( నమస్తే భరత్ ): రాబోయే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్, గాజులరామారం సర్కిల్ అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మహాదేవపురంలోని శుభమస్తు బ్యాంకెట్ హాల్‌లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), బీఎల్ఓ సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు జూన్ 25, 2026 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం లక్ష్యాలు, విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పులు, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఏఈఆర్ఓ) యు. వెంకట్రాములు మాట్లాడుతూ, సమగ్ర ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలు కీలక భూమిక పోషించాలని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత ప్రాధాన్యత కలిగిన పత్రం అని పేర్కొన్న ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని కోరారు. ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించి, ఓటరు జాబితా పారదర్శకంగా, విశ్వసనీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఏఈఆర్ఓ ఆర్. సుమిత్రతో పాటు బీఎల్ఓ సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. సవరణ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా అంశాలపై అవగాహన పొందడంతో పాటు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి, స్వచ్ఛమైన, సమగ్రమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

