Yiప్రభుత్వ భూమికి గిఫ్ట్ డీడ్..!

సాయి నగర్‌లో 11 గుంటల ప్రభుత్వ స్థలంపై ఆక్రమణ ఆరోపణలు
అక్రమ రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్ల రద్దుకు ఎమ్మార్వోకు ఫిర్యాదు
ప్రభుత్వ భూమేనని రెవెన్యూ సర్వేలో తేలిందని ఆకుల సతీష్ వెల్లడి
స్థలాన్ని స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ హాల్‌కు కేటాయించాలని డిమాండ్
బాచుపల్లి, జూన్ 18 ( నమస్తే భరత్ ): సాయి నగర్‌లోని సర్వే నెంబర్ 186లో ఉన్న సుమారు 11 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, కల్పిత పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్లు నిర్వహించారని ఆరోపిస్తూ సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాచుపల్లి ఎమ్మార్వో వాణిరెడ్డికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ.. ప్రగతి నగర్, వాసవి లేఅవుట్ సమీపంలోని సాయి నగర్‌లో గల సర్వే నెం.186లో సుమారు 11 గుంటల (1,320 చదరపు గజాలు) భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిని ప్రైవేట్ సర్వే నెంబర్‌గా చూపిస్తూ నకిలీ, కల్పిత పత్రాల ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు ఆరోపించారు. డాక్యుమెంట్ నెం.10919/2005 ద్వారా ఆర్. శ్రీరాములు పేరిట, అనంతరం డాక్యుమెంట్ నెం.12141/2011, 2058/2011ల ద్వారా గిఫ్ట్ డీడ్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ లావాదేవీలకు సంబంధించి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లేదా పూర్తి పత్రాల ఆధారాలు లేవని ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి జీ+5 భవన నిర్మాణం కోసం 2019లో హెచ్ఎండీఏకు దరఖాస్తు చేయగా, హెచ్ఎండీఏ ప్రొసీడింగ్స్ నెం.029095/MED/R1/U6/HMDA/14102019, తేదీ 28-07-2020 ద్వారా ప్రాథమిక అనుమతి మంజూరైందన్నారు. అయితే ఈ అనుమతులపై 2022 నుంచే స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాగా ఇటీవల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో సర్వే నెం.186లోని 11 గుంటలు ప్రభుత్వ భూమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డాక్యుమెంట్ నెంబర్లు 10919/2005, 12141/2011, 2058/2011లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఎండీఏ ప్రాథమిక అనుమతులను రద్దు చేసి, మోసపూరితంగా పొందిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ స్థలాన్ని స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించాలని ఆకుల సతీష్ విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అరుణ్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

