యోగతో ఆరోగ్యం.. హోమియోతో సంపూర్ణ జీవనం

బౌరంపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అవగాహన సమావేశం
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్ సేవలు
• యోగ సాధనతో ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమన్న నాయకులు
• యోగాకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని మోదీ
• ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

బౌరంపేట, జూన్ 18: ( నమస్తే భారత్ );జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బౌరంపేట వార్డు కార్యాలయంలో ఆయుష్ శాఖ ప్రతినిధులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి, డాక్టర్ కళావతి, డాక్టర్ రాజమోహన్, ఫార్మసిస్ట్ భాగ్యలక్ష్మి, యోగా ఉపాధ్యాయులు సాయికృష్ణ, శిరీష, బీజేపీ నాయకులు డి. సీతారాం రెడ్డి, నల్ల రాజిరెడ్డి, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బౌరంపేట గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్ పథకం కింద హోమియోపతి ఆరోగ్య కేంద్రం, ఆశా ఆరోగ్య కేంద్రం, యోగ కేంద్రం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన యోగ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 30 మంది శిక్షణ పొందుతున్నారని, వచ్చే ఏడాదికి 100 మందికి పైగా హాజరు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగ అనేది భారతీయ ఋషులు, మునుల తపస్సు ఫలితమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ గొప్ప సాధనమని ఆయన పేర్కొన్నారు. భారతీయ సంపదైన యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కృషితో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. గత దశాబ్ద కాలంగా యోగాపై ప్రజల్లో అవగాహన పెరిగి, యోగ సాధనతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించాయని చెప్పారు. హోమియోపతి వైద్యులు మాట్లాడుతూ యోగ ఆరోగ్యానికి పునాది అయితే, హోమియోపతి దానికి తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు. మానసిక ఆరోగ్య సమస్యల నివారణలో యోగ, హోమియోపతి రెండూ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు వివరించారు.

