ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఎడిటోరియల్దాహంతో నిజాంపేట్... నిద్రలో వాటర్‌బోర్డు!

దాహంతో నిజాంపేట్… నిద్రలో వాటర్‌బోర్డు!

📰 Generate e-Paper Clip

దాహంతో నిజాంపేట్… నిద్రలో వాటర్‌బోర్డు!

 

నిజాంపేట్‌కు నీళ్లు కరువు… అధికారులకు పట్టదా?

రోజురోజుకూ ముదురుతున్న తాగునీటి సంక్షోభం

ఐదు లక్షల జనాభాకు వారానికి ఒక్కసారే తాగునీటి సరఫరా

నీరు లేకున్నా బిల్లుల వసూళ్లు.. ట్యాంకర్ల వ్యాపారంపై అనుమానాలు

14 ఎంజీడీ కేటాయింపు, కోటి లీటర్ల అదనపు నీరు కోరిన జేఏసీ

ప్రగతి నగర్, జూన్‌ 15 ( నమస్తే భరత్ )
నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా పెరగకపోవడంతో అనేక కాలనీల్లో నీటి కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిజాంపేట్‌ సర్కిల్‌ జేఏసీ ప్రతినిధులు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌లకు వినతిపత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ ప్రతినిధుల వివరాల ప్రకారం నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలో ప్రస్తుతం సుమారు ఐదు లక్షల జనాభా నివసిస్తోంది. ప్రగతి నగర్‌, బాచుపల్లి, నిజాంపేట్‌ తదితర ప్రాంతాల్లో పంపింగ్‌ స్టేషన్లు ఉన్నప్పటికీ అవసరమైన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని పేర్కొన్నారు. దీంతో అనేక కాలనీల్లో వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు అందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 130 లీటర్ల తాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో కనీస అవసరాలు కూడా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలోనే ట్యాంకర్ల ద్వారా నీటి విక్రయాలు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు, పాత మోటార్లు, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జేఏసీ ఆరోపించింది. లక్షల రూపాయలు చెల్లించి నీటి కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సరైన సరఫరా అందకపోయినా కనీస బిల్లుల వసూళ్లు కొనసాగించడం అన్యాయమని మండిపడింది.


ప్రగతి నగర్‌ ప్రాంతానికి రోజుకు కనీసం ఒక కోటి లీటర్ల అదనపు తాగునీటిని సరఫరా చేయాలని, నిజాంపేట్‌ సర్కిల్‌కు కనీసం 14 ఎంజీడీ నీటి కేటాయింపునకు అవసరమైన ట్రాన్స్‌మిషన్‌ అలొకేషన్‌ ఆర్డర్‌ (టీఏఓ) మంజూరు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. అలాగే ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి, పైప్‌లైన్‌ లీకేజీలు, పంపింగ్‌ వ్యవస్థలోని లోపాలను తక్షణమే సరిచేయాలని కోరింది. తాగునీటి సమస్యను అత్యవసర అంశంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!