
వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలి
త్రాగునీటి సరఫరా వేళల్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశం
డ్రైనేజీ సమస్యతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని స్థానిక వాసుల ఆవేదన
రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ, వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. శనివారం 126వ డివిజన్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఎమ్మెల్యే వివేకానంద్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం వార్డు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని, అర్ధరాత్రి సమయంలో తక్కువ ఒత్తిడితో త్రాగునీరు సరఫరా చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాసులు వివరించారు. అలాగే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న వ్యాపార డబ్బాలను తొలగించాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప సముదాయంలో అధిక సంఖ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. కూలి పనులు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అర్ధరాత్రి వేళల్లో త్రాగునీరు సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. త్రాగునీటి సరఫరా సమయాలను పునర్విమర్శించి సాయంత్రం వేళల్లో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, అనువైన మార్గాలు కల్పించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వివిధ శాఖల అధికారులు, రాజీవ్ గృహకల్ప సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, గృహకల్ప వాసులు తదితరులు పాల్గొన్నారు.




