అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరపాలి
దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్ చేయాలి
సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మోడం మల్లేశం
నర్సంపేట, నవంబర్ 6 ( బి.మల్లేష్ ,నమస్తే భారత్): నర్సంపేట నాయోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మోడం మల్లేశం డిమాండ్ చేశారు. అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపును సీజ్ చేయాలని, షాపు యాజమాన్యానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
ఈసందర్భంగా సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మోడం మల్లేశం మాట్లాడుతూ దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపును జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తనిఖీ చేసిన సమయంలో అక్రమ మద్యం బయటపడినట్లు ఆరోపించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని బ్రాందీ షాపుల నుంచి తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.తనిఖీల్లో అక్రమ మద్యం గుర్తించినప్పటికీ, షాపు యాజమాన్యం సంబంధిత అధికారులతో మంతనాలు జరిపి, డబ్బులు చేతికందించడంతో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, చర్యలు తీసుకోకుండా అధికారులు వెనుదిరిగినట్లు ఆరోపించారు.అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, వారికి సహకరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని, సంబంధిత బ్రాందీ షాపును వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.గిర్నిబావి, నర్సంపేట డివిజన్ పరిధిలోని ఇతర మండలాల్లో కూడా బ్రాందీ షాపుల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు.ఈమేరకు ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు.అక్రమ మద్యం వ్యాపారులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులుగా తేలితే సస్పెండ్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మోడం మల్లేశం, భూమా అశోక్, అనిల్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.



