జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.
టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆద్వర్యంలో డిమాండ్స్ డే
నమస్తే భారత్ :-మహబూబాబాద్
జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ తో టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ ల దినోత్సవాన్ని నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ గాంధీపార్క్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేసారు.
అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ కు జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ.సందర్భంగా టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ.దేశంలో మారుతున్న మీడియా రంగ పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి విధానపరమైన సిఫార్సులు చేసేందుకు కొత్త మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, వార్తా సంస్థల భద్రతకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.కొత్త కార్మిక చట్టాల్లో విలీనమైన 1955, 1958 నాటి వర్కింగ్ జర్నలిస్టుల ప్రత్యేక చట్టాల ద్వారా గతంలో కల్పించిన హక్కులు, ఉద్యోగ భద్రత, పని గంటలు, వివాద పరిష్కార విధానాలు, సేవల విరమణకు సంబంధించిన రక్షణలను పునరుద్ధరించాలని కోరారు. ప్రింట్, ప్రసార, డిజిటల్ మీడియా ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేసి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ.కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లాకోశాధికారి వెంకటరమణ, జిల్లాఉపాద్యక్షుడు ఉమ్మగాని మధు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లాప్రదానకార్యదర్శి రంగాచౌదరి,జిల్లాకార్యవర్గసభ్యుడు అశోక్, తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.



