ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeఎడిటోరియల్మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి..!

మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి..!

📰 Generate e-Paper Clip

మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి..!

– పాలకవర్గం ఘోరంగా విఫలమైంది:

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధిని కొన్ని వార్డులకే పరిమితం చేయకుండా అన్ని వార్డులకు సమానంగా విస్తరించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బాణాల రాజన్న అధ్యక్షతన జరిగిన సిపిఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
2017లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని, శివారు ప్రాంతాలు మాత్రం నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటిస్తున్నప్పటికీ, వాటి ప్రయోజనం అన్ని వార్డులకు అందడం లేదన్నారు. అభివృద్ధి పనుల్లో పాలకవర్గం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
సీతారాంపురం కాలనీ, పూలబజారు, గోపాలరావు నగర్, మైనార్టీ కాలనీ, బొత్తల తండా, మందుల బజారు, ఇంద్రానగర్ కాలనీ, మాకుల తండా, ఆళ్లగడ్డ తండా, కొత్త తండా తదితర ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది మొత్తం మున్సిపాలిటీకి విస్తరించాల్సి ఉండగా, కొద్ది వార్డులకే నిధులు కేటాయించి పనులు చేపట్టడం వల్ల శివారు ప్రాంతాలు గత 12 ఏళ్లుగా వెనుకబడి పోయాయని అన్నారు.నేషనల్ హైవే ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల నాణ్యత కూడా ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నత్తనడకన సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పట్టణ కేంద్రంలోని అంగడి రోడ్డులో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, ముఖ్యంగా ఆదివారం సంత రోజున మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సెంటర్ లైటింగ్ పనిచేయక పట్టణం అర్ధాంధకారంలో ఉండటంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించడంలో నాడు నేడు ఉన్న పాలకవర్గం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించి సమాన అభివృద్ధి చేపట్టాలని, లేనిపక్షంలో స్థానిక ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, నాయకులు బాణాల రాజన్న, కొండ ఉప్పలయ్య, దొంతు సోమన్న, మమత, తాటికొండ అనంతచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!