*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
*మాల మహానాడు జిల్లా కార్యదర్శి జగన్ పిలుపు*
నమస్తే భారత్ షాద్‌నగర్,సెప్టెంబర్23: రోస్టర్ విధానం, గత ప్రభుత్వాలు అమలు చేసిన వర్గీకరణ కారణంగా మాల, మాల అనుబంధ కులాలకు అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జిల్లా కార్యదర్శి జగన్ పేర్కొన్నారు. ఈ సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘మాల విద్యార్థి గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో మాల మహానాడు నాయకులు మాల విద్యార్థి గర్జనకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రోస్టర్ విధానం వల్ల మాల, మాల అనుబంధ కులాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు.
గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వర్గీకరణ విధానం వల్ల తమ వర్గానికి నష్టం జరుగుతోందని మాల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు, తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు మాల విద్యార్థి గర్జనను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
షాద్‌నగర్ ప్రాంతం నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, మాల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ కోరారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కొన్నింటి అశోక్, బర్ల శ్రీనివాస్, జగన్ తదితరులు పాల్గొన్నారు.



