ePaper
Friday, August 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి

“అవయవ దానం.. మరో జీవితానికి ప్రాణదానం”

మరణానంతరం కూడా మనిషి జీవించగలడు..

ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం

అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి:

ప్రముఖ సామాజిక కార్యకర్త లయన్ అన్నెం కోటిరెడ్డి

కుత్బుల్లాపూర్ ,ఆగస్టు 13, ( నమస్తే భరత్ ) : అవయవ దానం మానవత్వానికి అందించే అత్యున్నత బహుమతి అని ప్రముఖ సామాజిక కార్యకర్త లయన్ అన్నెం కోటిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. అవయవ దానంపై సమాజంలో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి తీసుకునే నిస్వార్థ నిర్ణయం మరణానంతరం పలువురి జీవితాల్లో వెలుగులు నింపగలదని తెలిపారు. ఒక అవయవ దాత తన అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనిషి మరణించిన అనంతరం కూడా అతని అవయవాలు మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం గొప్ప మానవతా సేవగా అభివర్ణించారు.

అవయవ దానం.. నిజమైన మానవతా సేవ

అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రోగులకు అవయవ దాతలు ఆశాకిరణంగా నిలుస్తారని కోటిరెడ్డి అన్నారు. అవయవ దానంపై ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

మరణం తర్వాత కూడా జీవించే అవకాశం

మనిషి జీవితానికి ముగింపు మరణంతోనే కాదని.. తన అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో భాగస్వామి కావచ్చని అన్నారు. కుటుంబ సభ్యులు, యువత, విద్యార్థుల్లో అవయవ దానంపై చైతన్యం తీసుకురావడానికి సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కొత్త ఆశ.. కొత్త జీవితం

అవయవ దానం వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం స్థానంలో ఆశ చిగురిస్తుందని, ప్రాణాపాయంలో ఉన్న వారికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం గురించి తెలుసుకుని, తమ కుటుంబ సభ్యులతో చర్చించి, సమాజంలో మరికొందరిని కూడా ప్రోత్సహించాలని లయన్ అన్నెం కోటిరెడ్డి కోరారు. “మన జీవితం ముగిసిన తర్వాత కూడా మన అవయవాలు మరొకరి జీవితాన్ని కొనసాగిస్తే.. అంతకంటే గొప్ప మానవతా సేవ మరొకటి ఉండదు. అవయవ దానంపై అవగాహన పెంచి.. ప్రాణదాతలుగా నిలుద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!