ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఎడిటోరియల్జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో విద్యా ప్రమాణాలపై డీఈవో రేణుకాదేవి ప్రత్యేక తనిఖీ

జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో విద్యా ప్రమాణాలపై డీఈవో రేణుకాదేవి ప్రత్యేక తనిఖీ

📰 Generate e-Paper Clip

జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో విద్యా ప్రమాణాలపై డీఈవో రేణుకాదేవి ప్రత్యేక తనిఖీ

➤ పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, లైబ్రరీ, క్రీడా సదుపాయాలపై ప్రశంసలు

➤ పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి

➤ అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరీక్షించిన డీఈవో

➤ ఇంటి వద్ద ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమని విద్యార్థులకు సూచన

➤ ఉపాధ్యాయుల కృషిని అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి

➤ జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం సందర్భంగా పాఠశాల సందర్శన

జీడిమెట్ల, ఆగస్టు 5 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రేణుకాదేవి బుధవారం జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యా ప్రమాణాలు, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల అభ్యాస స్థాయిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా, సహపాఠ్య, సహకార కార్యక్రమాల వివరాలను డీఈవోకు వివరించారు. పాఠశాల పరిశుభ్రత, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, లైబ్రరీ వినియోగం, క్రీడా కార్యకలాపాల నిర్వహణను పరిశీలించిన డీఈవో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన డీఈవో వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. గణితంలో ప్రస్తుతం బోధిస్తున్న యూనిట్, ప్రాజెక్టులు, క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్‌లపై ఆరా తీశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆమ్లాలు (Acids), ప్రయోగశాల కార్యకలాపాలు, ముఖ్య నిర్వచనాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థులకు అవసరమైన సూచనలు అందించారు. తెలుగులో పద్యాలు, కవి పరిచయం, గద్యభాగాలపై, అలాగే హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు ప్రతిరోజూ ఇంటి వద్ద చదువుకునేందుకు సమయపాలనతో కూడిన ప్రణాళిక రూపొందించుకోవాలని, ఇప్పటి నుంచే ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈవో రేణుకాదేవి సూచించారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశానికి ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి అరుణ జ్యోతి ఆధ్వర్యంలో విచ్చేసిన డీఈవో, సమావేశానికి ముందు పాఠశాల స్థితిగతులను పరిశీలించి ఉపాధ్యాయుల అంకితభావాన్ని ప్రశంసించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!