ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్యాప్ వినియోగంపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి

యాప్ వినియోగంపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

*యాప్ వినియోగంపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి*

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*ప్రతి ఊరిలో ఆదర్శ రైతులకు శిక్షణ ఇవ్వాలి*

*వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కీలక సూచనలు*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 13: వ్యవసాయ రంగంలో ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డీఏపీ యాప్ విధానంతో రైతులు, ఫెర్టిలైజర్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నందిగామ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని రైతుల సమస్యలపై గళమెత్తారు.

*అవగాహన లేకనే ఎరువుల నిల్వలు:*

సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రైతులు పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో సరైన శాస్త్రీయ అవగాహన లేకుండా వాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో యూరియా దొరకదేమోననే వదంతులతో రైతులు భయాందోళనలకు గురై, పది బస్తాలు అవసరమయ్యే చోట ఇరవై బస్తాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకునేవారని గుర్తుచేశారు. ఈ క్రమంలో యూరియా పంపిణీకి యాప్ విధానం తీసుకురావడంతో ఆ సమస్య చాలా వరకు పరిష్కారమైందని ఆయన తెలిపారు.

*కొత్త యాప్‌తో సాంకేతిక చిక్కులు:*

యూరియా తరహాలోనే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న డీఏపీ యాప్‌లో అనేక సాంకేతిక లోపాలు (టెక్నికల్ ఎర్రర్స్) తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల డీలర్లు, రైతులు ఎరువులు తీసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పట్టణ ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పటికీ, సామాన్య రైతులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం, యాప్ ద్వారా ఎరువుల వివరాలు నమోదు చేయడంపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదని స్పష్టం చేశారు. విధానాలు రూపొందించే అధికారుల అంచనాలకు, క్షేత్ర స్థాయిలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులకు వ్యత్యాసం ఉందన్నారు.

*గ్రామాల్లో ఆదర్శ రైతులకు శిక్షణ:*

రాబోయే సీజన్ నాటికి ఈ యాప్ ఇబ్బందులను అధిగమించడానికి వ్యవసాయ అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు ఆదర్శ రైతులను ఎంపిక చేసి, వారికి యాప్ వినియోగంపై ముందుగా శిక్షణ ఇస్తే.. వారు ఆయా గ్రామాల్లోని మిగతా రైతులకు ఎరువుల కొనుగోలులో సహాయపడతారని ఆయన అధికారులకు ఓ చక్కటి పరిష్కారాన్ని సూచించారు.
ఈ కీలక సమావేశంలో వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్ కుమార్, బి. నరసింహారావు, ఏడీఏ లు మాధవి, సత్యంబాబు, ఏడీఎస్ శైలజతో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!