నిజాంపేట్‌లో డంపింగ్ యార్డ్ చెల్లింపులపై అక్రమాల ఆరోపణలు
సిఎంసి కమిషనర్‌కు సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ ఫిర్యాదు
రూ. 3.40 కోట్ల చెల్లింపులపై సమగ్ర విచారణకు విజ్ఞప్తి
టెండర్లు, బిల్లులు, జీఎస్టీ నమోదుల పరిశీలన కోరిన ఫిర్యాదుదారు
పలువురు ప్రస్తుత, మాజీ అధికారుల పాత్రపై విచారణ డిమాండ్
ప్రజాధనం దుర్వినియోగం తేలితే రికవరీతో పాటు చర్యలు తీసుకోవాలని వినతి
నిజాంపేట్, జూన్ 12: ( నమస్తే భరత్ ) నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో డంపింగ్ యార్డ్ నుంచి జవహర్‌నగర్‌కు చెత్త రవాణా కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులు, రికార్డుల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువడిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ సిఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, 2023 నుంచి 2025 మధ్యకాలంలో డంపింగ్ యార్డ్ చెత్త రవాణా కాంట్రాక్టులకు సంబంధించి సుమారు రూ.3.40 కోట్ల మేర చెల్లింపుల్లో అవకతవకలు జరిగి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన నిధులు ఇతర సంస్థల పేర్లతో మళ్లించబడ్డాయనే ఆరోపణలపై లోతైన విచారణ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఫిర్యాదులో అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధీరజ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సబీర్ అలీతో పాటు సంబంధిత అధికారుల పాత్రను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ రవాణా కాంట్రాక్టులు, టెండర్ ప్రక్రియ, బిల్లుల చెల్లింపులు, మెజర్‌మెంట్ బుక్స్, జీఎస్టీ నమోదులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు సహా అన్ని సంబంధిత పత్రాలు, రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే, జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కాకుండా జే ఎం సీ కన్స్ట్రక్షన్ పేరుతో రికార్డులు నిర్వహించినట్లు అనుమానాలు ఉన్నాయని, దీనిపై కూడా ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిధులను తిరిగి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, 2020 నుంచి 2025 వరకు జరిగిన సివిల్ వర్క్స్, డంపింగ్ యార్డ్‌కు సంబంధించిన అన్ని చెల్లింపులపై స్వతంత్ర, పారదర్శక విచారణ నిర్వహించి బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ కోరారు.



