ఎస్ఐఆర్లో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి

-స్వచ్ఛందంగా పాల్గొని బీఎల్వోలు, బీఎల్ఏలకు సహకరించండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
-పద్మానగర్‌లో ప్రత్యేక అవగాహన సమావేశం
-సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజల సహకారం కీలకం
-ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ అందుబాటులో
-ఓటరు వివరాలపై పూర్తి సమాచారం అందించాలని సూచన
అవగాహనతో బాధ్యతలు నిర్వర్తించాలన్న బీఎల్వోలు, బీఎల్ఏలకు పిలుపు
పేట్ బషీరాబాద్, జూలై 7 ( నమస్తే భరత్ ): కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఓటరు స్వచ్ఛందంగా పాల్గొని బీఎల్వోలు, బీఎల్ఏలకు సహకరించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. 285వ డివిజన్ పద్మానగర్ ఫేజ్–2లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన అధికారులతో పాటు బీఎల్వోలు, బీఎల్ఏలు, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక పరిశీలన కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా బీఎల్వోలు, బీఎల్ఏలు సమగ్ర అవగాహనతో పనిచేస్తూ ప్రతి ఓటరుకు సరైన సమాచారం అందించాలని సూచించారు. 2002 సంవత్సరం ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని పరిశీలన జరుగుతున్నందున, అప్పటి ఓటరు వివరాలు, ప్రస్తుతం ఓటు నమోదు ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు బీఎల్వోలు, బీఎల్ఏలకు అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పారదర్శకమైన, సమగ్ర ఓటరు జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచడం వల్ల ప్రజలు తమకు అనుకూలమైన విధానంలో వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, బీఎల్ఏలు, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, వివిధ కాలనీల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.



