ePaper
Saturday, July 4, 2026
ePaper
Homeఎడిటోరియల్12 రోజుల ఉత్కంఠకు తెర.. కిడ్నాప్‌కు గురైన చిన్నారి నిఖిల్ క్షేమంగా లభ్యం

12 రోజుల ఉత్కంఠకు తెర.. కిడ్నాప్‌కు గురైన చిన్నారి నిఖిల్ క్షేమంగా లభ్యం

📰 Generate e-Paper Clip

12 రోజుల ఉత్కంఠకు తెర.. కిడ్నాప్‌కు గురైన చిన్నారి నిఖిల్ క్షేమంగా లభ్యం

— సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అపహరణ ఘటనకు సుఖాంతం

-సీసీటీవీ ఆధారాలతో నిందితుడి జాడ కనిపెట్టిన పోలీసులు

-జీడిమెట్ల పోలీసుల అప్రమత్తతతో చిన్నారి సురక్షితంగా రక్షణ

– – వీడియో కాల్‌లో కుమారుడిని గుర్తించి భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు

– నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించి తదుపరి విచారణ

– పోలీసుల సమన్వయం, చాకచక్యానికి ప్రశంసల వెల్లువ

జీడిమెట్ల, జులై 2 ( నమస్తే భరత్): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గత నెల 20న కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల చిన్నారి నిఖిల్ రాజు సురక్షితంగా లభ్యమవడంతో 12 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సమన్వయంతో చేపట్టిన దర్యాప్తు ఫలించి చిన్నారిని క్షేమంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. గత నెల 20న నిఖిల్ తన అమ్మమ్మతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రైలు ఆలస్యమవడంతో ప్లాట్‌ఫారంపై అమ్మమ్మ ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని అదనుగా భావించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం మేల్కొన్న కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడి ముఖచిత్రం స్పష్టంగా లభించినప్పటికీ, అతడు గుర్తింపు పత్రాలు లేకుండా ఓయో గదుల్లో బస చేస్తూ తరచూ ప్రాంతాలు మారుతుండటంతో అతని ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు షేక్ మహబూబ్ అలీ అనే వ్యక్తి చిన్నారితో కలిసి రావడం పోలీసుల దృష్టికి వచ్చింది. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా, తొలుత రెండు రోజుల క్రితం బాలుడు తనకు దొరికాడని చెప్పాడు. అయితే లోతుగా విచారణ చేపట్టడంతో గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చిన్నారిని తానే తీసుకెళ్లినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం చిన్నారి ఫొటోలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పంపించగా, కిడ్నాప్‌కు గురైన నిఖిల్ రాజేనని నిర్ధారణ అయింది. అనంతరం వీడియో కాల్ ద్వారా చిన్నారిని తల్లిదండ్రులకు చూపించగా, తమ కుమారుడేనని వారు ధృవీకరించారు. దీంతో చిన్నారిని అధికారికంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు షేక్ మహబూబ్ అలీని జీడిమెట్ల పోలీసులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రైల్వే పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, జీడిమెట్ల పోలీసుల సమన్వయం, అప్రమత్తత, సాంకేతిక ఆధారాల వినియోగం కీలక పాత్ర పోషించాయని అధికారులు వెల్లడించారు. చిన్నారి సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందంపై స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!