మంత్రి సీతక్క ని కలిసి గిరిజన సమస్యలపై వినతిపత్రం సమర్పించిన ఆదివాసి నాయకులు

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి, తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజు, తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు కోడేం వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో* గౌరవ పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి *శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క)* గారిని కలిసి ఆదివాసులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతిపత్రం సమర్పించి చర్చించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి రెండు గిరిజన సహకార సంఘాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించి, గిరిజన సంఘాలకు సమన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నాయకులు కోరారు. అదేవిధంగా గిరి వికాస్ పథకం అమలులో ఉన్న సమస్యలు, గిరిజన గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం కొత్త బోర్లు మంజూరు చేయడం, *పోడు భూముల* సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం, అర్హులైన ఆదివాసులకు భూ హక్కులు కల్పించడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గిరిజన యువత నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని, ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదివాసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో *శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు* కూడా పాల్గొని, గిరిజన మహిళల జీవనోపాధి, వీరాపురం రీచ్ అంశం మరియు గ్రామీణ సమస్యలకు సంబంధించిన విషయాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు గిరిజనుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.ఆదివాసి హక్కులు, జీవనోపాధి, పోడు భూములు, తాగునీటి సౌకర్యాలు మరియు యువత ఉపాధి అవకాశాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆదివాసి నాయకులు స్పష్టం చేశారు.

