నక్ష సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

నిర్ణీత గడువులో సర్వే, నమోదు ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశం
వర్షాకాల సన్నద్ధతలో భాగంగా వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల పరిశీలన
నమస్తే భారత్: భద్రాది కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నక్ష కార్యక్రమంలో భాగంగా మణుగూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆర్.ఓ.ఆర్. (రికార్డ్ ఆఫ్ రైట్స్) నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వర్షాకాల సన్నద్ధతలో భాగంగా గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
మణుగూరు మండలం కొమ్ముగూడెం గ్రామంలో మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న ఆర్.ఓ.ఆర్. నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఎంట్రీ నమోదు చేయడానికి పడుతున్న సమయం, నమోదు చేస్తున్న వివరాల స్వరూపం, ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నక్ష పైలట్ ప్రాజెక్టు ద్వారా భూ రికార్డుల సమగ్రత, పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు భూములకు సంబంధించిన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సర్వే, నమోదు ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మణుగూరు మండలం అన్నారం, కమలాపురం గ్రామాల్లో గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి నీటిమట్టం పెరిగిన సమయంలో కోడిపుంజుల వాగు ద్వారా ఎదురు నీరు ప్రవహించడం వల్ల ఏర్పడే ముంపు పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రజల తరలింపు ఏర్పాట్లు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై అధికారులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మణుగూరు సింగరేణి పి కే ఓ సి ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతం నుంచి విడుదలయ్యే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. గాంధీనగర్‌లోని ఓపెన్ కాస్ట్ గనుల నుండి నీరు విడుదల చేసే ప్రదేశం నుంచి సుందరయ్య నగర్, కాళీమాత ఆలయ పరిసర ప్రాంతాలు, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీల్లో పూడిక, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు వేగంగా వెళ్లే విధంగా కాలువలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు సిద్ధంగా ఉంచాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాతావరణ హెచ్చరికలు, నీటిమట్టాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన లో కలెక్టర్ వెంట మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

