యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకండి

పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, మరికొందరికి ఉపాధి కల్పించాలి
ఎన్ఎస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నమస్తే భరత్ , రాజేంద్రనగర్, నవంబర్ 15,యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ లో ఏర్పాటు చేసిన ఎన్ఎస్ ఇండస్ట్రీస్ పరిశ్రమను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్ఎస్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి పారిశ్రామికవేత్తలుగా నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న యువకులు విశాల్, సాగర్లను అభినందించారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనే సంకల్పంతో పరిశ్రమను స్థాపించడం అభినందనీయమన్నారు.తాము స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు, ఇతరులకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.విశాల్, సాగర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వీరి విజయ ప్రయాణం మరెందరో యువతకు స్ఫూర్తినిస్తూ, స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.యువతలో ఉన్న నైపుణ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల్లో యువ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర రావు,
సీపీఓ సౌమ్య, జిఎం ఇండస్ట్రీస్ శ్రీలక్ష్మి, పలు పారిశ్రామిక వేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



