ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణకోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

📰 Generate e-Paper Clip

కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

భవనానికి ప్రజా వీరుడు పండుగ సాయన్న పేరు పెట్టాలి: డాక్టర్ వై. శివ ముదిరాజ్

నమస్తే భరత్ నవంబర్ 5 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: కోకాపేటలో ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించిన ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు డాక్టర్ వై. శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ భవనానికి తెలంగాణ చరిత్రలో ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజా వీరుడు పండుగ సాయన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి వ్యక్తిగత ట్రస్టులను రద్దు చేసి, వాటిని పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ప్రముఖ బీసీ, బహుజన మేధావులు, సామాజిక ఉద్యమ నాయకులు హాజరయ్యారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు సుభాష్, పాశం యాదగిరి, క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్విరాజ్ యాదవ్, హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ తదితరులు పాల్గొని బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రకటించిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో భాగంగా కోకాపేటలో ముదిరాజ్ సామాజిక వర్గానికి స్థలం కేటాయించారని గుర్తుచేశారు. అయితే ఇంతకాలం గడిచినా భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు.
ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కేవలం ఒక భవనంగా మాత్రమే మిగిలిపోకూడదని, అది సమాజ అభ్యున్నతికి కేంద్రంగా మారాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ కుటుంబాలకు చెందిన నిరుపేద విద్యార్థులు, యువతీ యువకులు, పేద కుటుంబాల ఆడబిడ్డలకు నాణ్యమైన విద్య, వసతి, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, ఉద్యోగ మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి వంటి సదుపాయాలు కల్పించేలా భవనాన్ని నిర్మించాలని సూచించారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ భవనం అండగా నిలవాలని, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం చూపాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే తెలంగాణ చరిత్రలో ప్రజల కోసం పోరాడిన ధీరుడు, ప్రజా వీరుడు పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు పరిచయం చేసే విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి ఆయన పేరు అధికారికంగా ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు, పండుగ సాయన్న పేరు ఖరారు చేసి, విద్యా, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దాలని డాక్టర్ వై. శివ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.
ముదిరాజ్ ఆత్మగౌరవం కోసం మాత్రమే కాదు… మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ భవనం నిర్మించాలి. పేద విద్యార్థుల విద్యకు, యువత అభ్యున్నతికి, ఆడబిడ్డల భవిష్యత్తుకు ఈ భవనం బాటలు వేయాలి” అని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!