కేబుల్ ఛానల్ జర్నలిస్టుల పోరాటానికి టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు
టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మల్లేష్ గౌడ్
హైదరాబాద్ (నమస్తే భారత్ ) :
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లను ప్రభుత్వం అణిచివేసే కుట్ర చేస్తోందని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బి. మల్లేష్ గౌడ్ విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ల జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆదేశాల మేరకు కేబుల్ ఛానళ్ల జర్నలిస్టుల పోరాటానికి రాష్ట్ర కమిటీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్ల సంఖ్యను తగ్గించాలనే కుట్రలో భాగంగానే ఇటీవల ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) నెట్వర్క్ ద్వారా ప్రసారాలు చేస్తున్నాయనే సాకుతో అనేక కేబుల్ ఛానళ్లకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. లక్షలరూపాయల పెట్టుబడులతో నడుస్తున్న అసలైన కేబుల్ ఛానళ్లకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా, అనర్హులకు కార్డులు కేటాయించారని విమర్శించారు.కేబుల్ ఛానళ్ల నిర్వాహకులు కూడా జర్నలిస్టులేనని, వారు ప్రభుత్వాన్ని కోరుతున్నది కేవలం అక్రెడిటేషన్ కార్డులేనని, గొంతెమ్మ కోర్కెలు కాదని మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు.గతంలో కేబుల్ ఛానళ్లకు జిల్లాకు నాలుగు అక్రెడిటేషన్ కార్డులు, రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఉండేవని, ప్రస్తుతం వాటిని సగానికి తగ్గించారని తెలిపారు. దీంతో ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలు లేక, మరోవైపు అక్రెడిటేషన్ కార్డులు అందక అనేక కేబుల్ ఛానళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిజం వృత్తిపై ఆధారపడి ఎన్నో ఏళ్లుగా ఛానళ్లను నిర్వహిస్తున్న వేలాది మంది జర్నలిస్టులను ప్రభుత్వం రోడ్డున పడేస్తోందని ధ్వజమెత్తారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్లను చిన్నచూపు చూడటం సరికాదని అన్నారు. ఐపీ ఛానళ్ల పేరుతో కేబుల్ ఛానళ్లను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న కేబుల్ ఛానళ్లకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా న్యాయబద్ధంగా అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని మల్లేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల సాధన కోసం కేబుల్ ఛానళ్ల యజమానులు, జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు.



