*వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం*

*చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలి*
*సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్*
నమస్తే భారత్ షాద్నగర్,సెప్టెంబర్16:వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఎం షాద్నగర్ కమిటీ ఆధ్వర్యంలో, పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ అధ్యక్షతన “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – వక్రీకరణ, వాస్తవాలు” అనే అంశంపై షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కాడిగళ్ల భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, గ్రామాల్లో భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన రైతాంగ ఉద్యమంగా నిలిచిందన్నారు.
“దున్నేవాడికే భూమి దక్కాలి” అనే నినాదంతో రైతులు, వ్యవసాయ కూలీలు భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీ, అక్రమ వసూళ్లు, భూముల నుంచి బహిష్కరణలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని తెలిపారు. ఈ పోరాటం క్రమంగా నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనగా విస్తరించిందన్నారు. ఈ ఉద్యమం గరిష్ఠ దశలో సుమారు 3,000 గ్రామాలను ప్రభావితం చేసిందని తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు, రైతులు ప్రాణత్యాగం చేశారని భాస్కర్ పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4,000 మంది కమ్యూనిస్టులు, రైతు కార్యకర్తలు ప్రాణాలను కోల్పోయిన చరిత్ర ఉందని తెలిపారు. పోరాటం సాగిన ప్రాంతాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడి ప్రజల ఆధ్వర్యంలో స్థానిక పరిపాలన కొనసాగిందన్నారు. అలాగే సుమారు 10 లక్షల ఎకరాల భూమి పేదలు, భూమిలేని రైతులకు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం రాజు మాట్లాడుతూ
1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయిందన్నారు. అయితే తెలంగాణలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వెంటనే ముగియలేదని, అది 1951 వరకు కొనసాగిందని, కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం అనంతరం 1951 అక్టోబర్లో సాయుధ పోరాటం విరమించబడిందని తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని వారు విమర్శించారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వాస్తవ ఆధారాలతో ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఈశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు ఏ. కుర్మయ్య, వెంకటరమణ, మహమ్మద్ బాబు, కావలి రాజు, లక్ష్మి, పార్వతమ్మ, శ్రీలత, లక్ష్మి, బాలరాజు, రాజు, కే. రాములు, హెచ్. రాములు, పాండు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్, శివ, సాయి, యశ్వంత్, విష్ణు, జానవి, చరిత్ర, చైతన్య, సన తదితరులు పాల్గొన్నారు.



