ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్వీధి వ్యాపారుల చట్టం–2014ను కాలరాస్తున్నది అధికారులు, ప్రజాప్రతినిధులే

వీధి వ్యాపారుల చట్టం–2014ను కాలరాస్తున్నది అధికారులు, ప్రజాప్రతినిధులే

📰 Generate e-Paper Clip

వీధి వ్యాపారుల చట్టం–2014ను కాలరాస్తున్నది అధికారులు, ప్రజాప్రతినిధులే

*కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్

ఇప్పటికైనా వీధి వ్యాపారుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్

వ్యాపారులను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడి

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 04:ప్రజలకు నిత్యావసర వస్తువులు తొలుత అందుబాటులో ఉంచేది వీధి వ్యాపారులేనని, అలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం–2014ను తీసుకొచ్చిందని, అయితే ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే దానిని నిర్లక్ష్యం చేస్తూ వీధి వ్యాపారులను వేధించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన చర్యల్లో ప్రధానంగా వీధి వ్యాపారుల డబ్బాలు, బండ్లనే తొలగించారని, అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన భవనాలపై అదే స్థాయిలో చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వీధి వ్యాపారులు ఇబ్బందికరమైన ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహిస్తే, చట్టం ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీ సమావేశమై వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ షాద్‌నగర్‌లో అలాంటి విధానం అమలులో కనిపించడం లేదని ఆయన అన్నారు. చౌరస్తా ప్రాంతంలో సమస్య ఉందనే పేరుతో టెలిఫోన్ ఎక్స్చేంజ్, పాల కేంద్రం గోడ సమీపంలో ఉన్న వీధి వ్యాపారుల డబ్బాలను పనికిరాకుండా ధ్వంసం చేశారని, అయితే అక్కడ ఆర్ అండ్ బీ శాఖ నిర్మించిన డ్రైనేజీ అవతలే ఆ డబ్బాలు ఉన్నాయని గుర్తు చేశారు. అదే ప్రాంతంలో ఎదురుగా ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ గోడను మాత్రం కనీసం ముట్టుకోడానికి కూడా అధికారులు ధైర్యం చేయలేదని విమర్శించారు.
వీధి వ్యాపారుల పట్ల వివక్ష చూపుతూ, వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని పినపాక ప్రభాకర్ పేర్కొన్నారు. వెంటనే వీధి వ్యాపారుల చట్టం–2014ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఇప్పటి వరకు చట్టాన్ని నిర్లక్ష్యం చేసి వీధి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ అంశంపై త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి, వీధి వ్యాపారుల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పినపాక ప్రభాకర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!