ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యూఎస్ఎఫ్ఐ మండిపాటు

విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యూఎస్ఎఫ్ఐ మండిపాటు

📰 Generate e-Paper Clip

విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యూఎస్ఎఫ్ఐ మండిపాటు

➤ రెండున్నరేళ్లు గడిచినా విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి నియామకం లేదని విమర్శ

➤ 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపణ

➤ ఉపాధ్యాయ నియామకాలు, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్‌షిప్‌లపై తీవ్ర అసంతృప్తి

➤ విద్యాశాఖను ఇతర శాఖలతో కలిపి నిర్వహించడం వల్ల నిర్ణయాలు జాప్యమని వ్యాఖ్య

➤ అనుభవం కలిగిన ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్

➤ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిక

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ విద్యారంగానికి ఇప్పటివరకు ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు పూర్తి స్థాయి బాధ్యతలు కలిగిన మంత్రి లేకపోవడం విచారకరమని అన్నారు. విద్యాశాఖను ఇతర శాఖలతో కలిపి నిర్వహించడం వల్ల కీలక ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయని, విధానపరమైన నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో జాప్యం, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో ఆలస్యం, కొత్త విద్యా విధానాల అమలుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యను ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా పరిగణించకుండా వ్యవహరించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎం. చంద్రకాంత్ అన్నారు. వెంటనే విద్యారంగంపై అవగాహన, అనుభవం కలిగిన పూర్తి స్థాయి ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!