కూకట్‌పల్లిని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తాం
→ మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి
→ కూకట్‌పల్లి అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
→ పేదల సొంతింటి కల సాకారం చేసేందుకే ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’
→ తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం
→ పదేళ్ల వారి పాలన.. రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి
→ మీ అండ ఉంటే అభివృద్ధి చేసి చూపిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
కూకట్‌పల్లి, ఆగస్టు 13: (నమస్తే భరత్);
కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి గురువారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కూకట్‌పల్లి ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారని సీఎం గుర్తుచేశారు.
గల్లీ నుంచి ఢిల్లీకి పంపారు
తాను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో కూకట్‌పల్లి ప్రజలు తనను ఆశీర్వదించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తాను ప్రతిపక్షంలో ఉన్నందున తగినన్ని నిధులు మంజూరు చేయించలేకపోయానని, దీంతో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కూకట్‌పల్లిని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అవకాశాలు, అధికారం ఉన్నాయని పేర్కొన్నారు.
“మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలి” అంటూ మంత్రి శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి ఆదేశించారు.
పాలనపై ప్రజలే బేరీజు వేయాలి
గత పదేళ్ల పాలనను, తమ రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో 3.28 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వివరించారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని చెప్పారు.
మహిళలను బస్సులకు యజమానులను చేయడంతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక చేయూత అందిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఏర్పాటు చేశామని వివరించారు.
పేదలకు సొంతిల్లు.. టవర్స్‌కు శ్రీకారం
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం తెలిపారు. తొలి విడతలో లక్ష ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. “మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా” అని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది
తనకు వయసుతో పాటు ఓపిక ఉందని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉందని సీఎం అన్నారు. ప్రజలు తమకు అండగా నిలిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు రావాలని కొంతమంది దుర్మార్గులు క్షుద్ర పూజలు చేశారని సీఎం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ దేవుడు తమ వైపు ఉన్నాడని, వర్షాలు కురిపించాడని అన్నారు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తమ సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉందని తెలిపారు. కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి అవే తిరిగి వారినే అష్టదిగ్బంధనం చేస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజల అండతో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.