NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:26 pm Posted by : NAMASTHE BHARAT

రేషన్ కార్డు కాదు.. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం కావాలి

రేషన్ కార్డు కాదు.. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం కావాలి

జాబ్ క్యాలెండర్ జాడే లేదు

2028లో బీసీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ‘సర్జికల్ స్ట్రైక్-59’

టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ (నమస్తే భారత్ ) : తెలంగాణలో బీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కేవలం సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీకి పరిమితం చేస్తోందని ఆయన విమర్శించారు. బీసీలకు నిజమైన ఆత్మగౌరవం రావాలంటే విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధితో పాటు రాజకీయ అధికారం కూడా దక్కాలని స్పష్టం చేశారు.

*రేషన్ కార్డు కాదు.. రాజ్యాధికారమే ఆత్మగౌరవం*

రేషన్ కార్డు తీసుకోవడం ఆత్మగౌరవం కాదని, పేదలకు ప్రభుత్వం అందించే సహాయం వారి జీవితాలను మార్చే శాశ్వత పరిష్కారం కాదని మల్లన్న అన్నారు. ప్రతి పేద కుటుంబంలోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పించడమే నిజమైన ఆత్మగౌరవమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి నిజంగా రేషన్ కార్డు ఆత్మగౌరవానికి ప్రతీక అని భావిస్తే, తన కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల ముందు లైన్లో నిలబెట్టాలని మల్లన్న సవాల్ చేశారు. బీసీలకు దానం అవసరం లేదని, తమ జనాభా బలానికి తగిన హక్కులు, అవకాశాలు, అధికారమే అవసరమని అన్నారు.

రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహం

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, సుమారు రూ.9 వేల కోట్ల బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని మల్లన్న ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమబద్ధీకరించి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ పేద విద్యార్థి చదువును మధ్యలో ఆపే పరిస్థితి లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి

ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేసే విధానాలను మల్లన్న తప్పుబట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 1,441 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దాని ప్రభావం నేరుగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాల పిల్లలపై పడుతుందని అన్నారు.

టీఆర్పీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య, డిజిటల్ విద్య వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని మల్లన్న పేర్కొన్నారు. విద్యను వ్యాపార వస్తువుగా కాకుండా ప్రతి పేద బిడ్డకు హక్కుగా అందించడమే తమ లక్ష్యమన్నారు.

ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ వైఫల్యం

యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మల్లన్న విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించకపోతే రేషన్ కార్డులు ఇచ్చినా వారి భవిష్యత్తు మారదని అన్నారు.

బీసీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా విధానాలను రూపొందిస్తామని తెలిపారు.

59 నియోజకవర్గాల్లో ‘సర్జికల్ స్ట్రైక్-59’

తెలంగాణలో బీసీల రాజకీయ రాజ్యాధికార సాధన కోసం ‘సర్జికల్ స్ట్రైక్-59’ కార్యక్రమాన్ని చేపట్టామని మల్లన్న ప్రకటించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసి బీసీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల బలం, రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక నాయకత్వం తదితర అంశాలపై డేటాను విశ్లేషించి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

మల్కాజిగిరిలో బీసీల ఓట్లు అధికం.. అధికారం మాత్రం ఇతరులదా?

మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన మల్లన్న.. అక్కడ సుమారు 2.49 లక్షల బీసీ ఓట్లు ఉన్నప్పటికీ, సుమారు 45 వేల ఓట్లున్న ఒక సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. మెజారిటీగా ఉన్న బీసీలు తమ ఓట్లతో ఇతరులను గెలిపించి, తాము మాత్రం రాజకీయంగా వెనుకబడే పరిస్థితిని మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు.

మేడ్చల్‌లో 3.25 లక్షల బీసీ ఓట్లు

మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం సుమారు 6.37 లక్షల ఓట్లలో 3.25 లక్షలకు పైగా బీసీ ఓట్లు ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బీసీ ఓటర్లు ఉన్నప్పటికీ రాజకీయ అధికారం బీసీల చేతుల్లోకి ఎందుకు రావడం లేదనే ప్రశ్నను ప్రతి బీసీ ఓటరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.గత ఎన్నికల్లో రెడ్లు అందరూ కలిసి మేడ్చల్ లో తనను ప్రచారానికి రాకుండా అడ్డుకొని బీసీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను ఓడగొట్టినట్లు తెలిపారు

ఉప్పల్‌లో ఇక బీసీ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాటం

ఉప్పల్ నియోజకవర్గంలో 2.70 లక్షలకు పైగా బీసీ ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు బీసీ నాయకత్వానికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదని మల్లన్న అన్నారు. ఇకపై బీసీల ఓట్లతో ఇతర సామాజిక వర్గాల నాయకత్వాన్ని నిలబెట్టే రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ఇబ్రహీంపట్నంలోనూ అదే పరిస్థితి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 1.69 లక్షల బీసీ ఓట్లు ఉండగా, సుమారు 26 వేల రెడ్డి ఓట్లు మాత్రమే ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. బీసీల ఓట్లతో గెలిచి తిరిగి బీసీలకే రాజకీయ అవకాశాలు లేకుండా చేసే పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటు మనదే.. అధికారం కూడా మనదే

బీసీల ఓటు బ్యాంకును కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించుకునే రాజకీయాలకు ఇక చరమగీతం పాడాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఓటు వేయడం మాత్రమే కాకుండా ఎవరు పోటీ చేయాలి, ఎవరు గెలవాలి, ఎవరు పాలించాలి అనే నిర్ణయంలోనూ బీసీలు కీలక పాత్ర పోషించాలన్నారు.

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించి, అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.

2028లో బీసీ ప్రభుత్వం

2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ‘సర్జికల్ స్ట్రైక్-59’ ద్వారా బీసీలను రాజకీయంగా సంఘటితం చేసి, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు.

బీసీల రాజ్యాధికారం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, బీసీల ఓటు బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారాలని ఆయన అన్నారు.

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తమ హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు కావాలని మల్లన్న పిలుపునిచ్చారు. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు కాకుండా విద్య, ఉద్యోగం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ అధికారం దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.