NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 9:30 pm Posted by : NAMASTHE BHARAT

మెట్రో, ఢిల్లీ పర్యటనలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన వివేకానంద గౌడ్

మెట్రో, ఢిల్లీ పర్యటనలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన వివేకానంద గౌడ్

– హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్

– రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో రద్దుపై తీవ్ర అభ్యంతరం

– ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ప్రయోజనం లేదని విమర్శ

– ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అంటూ రేవంత్ రెడ్డిపై ఎద్దేవా

– నగర అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపణ

– మీడియాతో మాట్లాడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్

 

కుత్బుల్లాపూర్, జులై 7 ( నమస్తే భారత్ ): రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి హైదరాబాద్ మెట్రోను మడతపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రితో మెట్రో రైలు అంశంపై చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ సమావేశంలో ఏం చర్చించారో ప్రజలకు వెల్లడించడం లేదని అన్నారు. కేంద్రానికి ప్రేమలేఖలు రాస్తూ కాలం గడుపుతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆరోపించారు.
మెట్రో రైలు విషయంలో నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదిత మెట్రో మార్గాన్ని రద్దు చేసేవారు కాదని వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసినా, తెలంగాణకు తీసుకొచ్చింది మాత్రం శూన్యమేనని విమర్శించారు. అందుకే ఆయనను ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వివేకానంద గౌడ్ ఆరోపించారు.