NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 2:27 pm Posted by : NAMASTHE BHARAT

ఫేక్ ఫైర్ ఎన్‌వోసీ స్కాంపై యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం

ఫేక్ ఫైర్ ఎన్‌వోసీ స్కాంపై యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

➤ హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు జారీ చేశారంటూ ఆరోపణలు

➤ 180 కళాశాలల నుంచి రూ.10.80 కోట్ల వసూళ్లపై సమగ్ర విచారణ కోరిన యూఎస్ఎఫ్ఐ

➤ నకిలీ పత్రాలు సమర్పించిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్

➤ విద్యార్థుల భద్రతను పణంగా పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న ఎం. చంద్రకాంత్

➤ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో మూడో పక్షంతో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి

➤ ఏడు రోజుల్లో చర్యలు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్);హైడ్రా అధికారుల పేరును దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలకు నకిలీ ఫైర్ ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) పత్రాలు సమర్పించినట్లు వెలుగులోకి వచ్చిన వ్యవహారాన్ని యూఎస్ఎఫ్ఐ (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన విద్యార్థుల ప్రాణ భద్రతను సైతం ప్రమాదంలోకి నెట్టిందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఇది సాధారణ అవినీతి కాదని, విద్యార్థుల ప్రాణాలతో ముడిపడిన అత్యంత తీవ్రమైన వ్యవహారమని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సృష్టించడం ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను బయటపెడుతోందని ఆరోపించారు. స్కాంలో భాగంగా సుమారు 180 ప్రైవేట్ కళాశాలల నుంచి ఒక్కో కళాశాలకు రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.10.80 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు వంటి కనీస భద్రతా ప్రమాణాలు లేకుండానే నకిలీ ఎన్‌వోసీలు జారీ చేయడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖల అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఎం. చంద్రకాంత్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించరాదని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగంలో సంస్కరణలు వేగవంతం చేయాలని, విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
యూఎస్ఎఫ్ఐ ప్రధాన డిమాండ్లు
నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలి.
స్కాంలో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి.
రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో స్వతంత్ర మూడో పక్షంతో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.
బాధ్యుల నుంచి నష్టాన్ని వసూలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి.
లేక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారించాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల ముట్టడి, సచివాలయం ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంఘం హెచ్చరించింది.