NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:06 pm Posted by : NAMASTHE BHARAT

విద్యాసంస్థల బంద్‌కు యూఎస్ఎఫ్ఐ పిలుపు

విద్యాసంస్థల బంద్‌కు యూఎస్ఎఫ్ఐ పిలుపు

ఢిల్లీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు బంద్ నిర్వహణ

.ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన యూఎస్ఎఫ్ఐ

.ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి

.విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపు

.నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన విద్యార్థి సంఘాలు

.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ ప్రకటన

కుత్బుల్లాపూర్, జూలై 23 ( నమస్తే భరత్ ): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిందని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ తెలిపారు. ఈ బంద్‌ను విద్యార్థులు, యువత, మేధావులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విద్యావ్యవస్థను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయని చంద్రకాంత్ పేర్కొన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అక్రమాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఎం. చంద్రకాంత్ విజ్ఞప్తి చేశారు.