NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:39 pm Posted by : NAMASTHE BHARAT

రూ. 2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం

రూ. 2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం

విద్యార్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం :

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట, అక్టోబర్ 25(మల్లేష్ నమస్తే భారత్ ) : నర్సంపేట పట్టణంలో గిరిజన బాలికల సౌకర్యార్థం రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, నర్సంపేటలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా గదులు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించి, విద్యార్థినులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రూ. 2 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.ఈ వసతి గృహంలో సుమారు 300 మంది విద్యార్థినులు ఉండేందుకు వీలుగా సదుపాయాలు కల్పించగా, ప్రస్తుతం దాదాపు 260 మంది విద్యను అభ్యసిస్తూ వసతి పొందుతున్నారని పేర్కొన్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థినులకు వసతి పరమైన ఇబ్బందులు తగ్గి, చదువుపై మరింత ఏకాగ్రతతో దృష్టి సారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. కళాశాల విద్యలో బాలికలు రాణించాలంటే వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో ముఖ్యమని చెప్పారు.

బాలికల విద్యాభివృద్ధికి వసతి గృహాలు కీలకం :

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, విద్యార్థినులకు సౌకర్యవంతమైన వాతావరణంలో వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గిరిజన బాలికల విద్యాభివృద్ధిలో వసతి గృహాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే వారు చదువుపై ఏకాగ్రత పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించగలరని అన్నారు. ఈ నేపథ్యంలో నూతన వసతి గృహం ప్రారంభం విద్యార్థినులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఎ. ప్రవీణ, కొత్తగూడ డివిజన్ డిప్యూటీ ఈఈ ఎ. దేవిశ్రీ, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.