దుండిగల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం
బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలి
వలసలు, మరణించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
దుండిగల్, జూన్ 18: ( నమస్తే భరత్ );
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సూపర్‌వైజర్లకు గురువారం దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్, గండిమైసమ్మ తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు.
వలస వెళ్లిన వారు, మరణించిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు నమోదైన ఓటర్ల వివరాల పరిశీలనలో బీఎల్ఓలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం ఖచ్చితంగా ఉండేలా ఇంటింటి సర్వేను నిబద్ధతతో నిర్వహించాలని ఆదేశించారు.
సవరణ ప్రక్రియ షెడ్యూల్ వివరాలు…
ఇంటింటి గణన (హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్): జూన్ 25 నుంచి జూలై 24 వరకు,
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: జూలై 31, క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ: జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు, విచారణ, పరిష్కారాల ప్రక్రియ: జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ: అక్టోబర్ 1,
బీఎల్ఓల బాధ్యతలు..
జూన్ 25 నుంచి ప్రతి ఇంటిని సందర్శించి, ముందస్తుగా ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను రెండు ప్రతుల్లో ఓటర్లకు అందజేయాలని అధికారులకు వివరించారు. ఫారమ్‌లను నింపడంలో అవసరమైన సహాయం అందించడంతో పాటు, పూర్తి చేసిన ఫారమ్‌లను సేకరించి ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని, మరో ప్రతిపై రసీదు జారీ చేసి ఓటర్లకు అందించాలని సూచించారు.
అలాగే, భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని సూపర్‌వైజర్లు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన పొందారు.