NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:19 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు

-ప్రతి వినతిని నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలి

-ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

మేడ్చల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 106 అర్జీల స్వీకరణ

అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 39 వినతులు

తిరస్కరించిన అర్జీలకు కారణాలు స్పష్టంగా తెలియజేయాలి

దరఖాస్తుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశం

కుత్బుల్లాపూర్, జూలై 27 ( నమస్తే భరత్ ): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి, ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వకుండా నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి ఫైజాన్ అహ్మద్ ప్రజల నుంచి మొత్తం 106 వినతులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, గృహ నిర్మాణం, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి తమ అర్జీలను సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసంతో కలెక్టరేట్‌కు వస్తారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడితే, అందుకు గల పూర్తి కారణాలను సంబంధిత అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అలాగే ప్రతి దరఖాస్తుపై చేపట్టిన చర్యల వివరాలను ఆన్‌లైన్ నమోదు వ్యవస్థలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు అత్యధిక వినతులు
ప్రజావాణిలో స్వీకరించిన మొత్తం 106 అర్జీలలో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 39 వినతులు అందాయి. అనంతరం గృహ నిర్మాణ శాఖకు 11, పట్టణ భూ పరిమితి విభాగం, జిల్లా విద్యాశాఖకు తలా 8, జిల్లా ఎన్నికల శాఖకు 7, అదనపు జిల్లా సర్వే, భూ రికార్డుల శాఖ, ఈ-సెక్షన్‌కు తలా 5, అదనపు జిల్లా పరిపాలన విభాగం, జిల్లా పౌర సరఫరాల శాఖ, జిల్లా సమాచార శాఖలకు తలా 2 వినతులు అందాయి. మిగిలిన శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజావాణి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అదనపు జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.