NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:48 pm Posted by : NAMASTHE BHARAT

అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి.

అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి.
కోతుల దాడిలో జినక సోమమ్మకు తీవ్ర గాయాలు.
బాధితురాలిని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం,

నమస్తే భారత్ మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని సీపీఐ(ఎం) మండల నాయకులు నందిపాటి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన జినక సోమమ్మను శుక్రవారం సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గురువారం ఇంటి ముందు పనులు చేస్తుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేసి సోమమ్మను కరవడంతో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూలేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న ఆమె కుమార్తె పద్మ వెంటనే అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సోమమ్మ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నందిపాటి వెంకన్న మాట్లాడుతూ అబ్బాయిపాలెం గ్రామంలో కోతుల బెడద అధికమై చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలపై తరచూ దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కోతులను అటవీశాఖ, సంబంధిత అధికారులు వెంటనే పట్టుకుని గ్రామం నుంచి తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరామర్శ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎర్ర వెంకన్న, జిన్నా లచ్చయ్య, సైదులు, జామ్మూర్తి, మైసయ్య, ఉపేందర్, బాధితురాలి కుటుంబ సభ్యులు పద్మ తదితరులు పాల్గొన్నారు.