NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 9:41 pm Posted by : NAMASTHE BHARAT

ఉద్యోగులను మోసగించిన ప్రభుత్వం -పీఆర్సీ, సీపీఎస్ రద్దు హామీలను వెంటనే అమలు చేయాలి:

ఉద్యోగులను మోసగించిన ప్రభుత్వం
-పీఆర్సీ, సీపీఎస్ రద్దు హామీలను వెంటనే అమలు చేయాలి:

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్

నమస్తే భారత్ :-మరిపెడ

ఎన్నికల సమయంలో, ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఉద్యోగులను మోసగిస్తోందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేష్ విమర్శించారు. టీపీటీఎఫ్ మరిపెడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలుపై ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించడం సరికాదన్నారు. తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు మరో ప్రజాస్వామిక ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. హెల్త్ కార్డు కోసం ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం రికవరీ చేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో రిఫరల్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పదవీ విరమణ బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డులపై స్పష్టమైన ఉత్తర్వుల జారీ అనే నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు హఫీజర్, రవీంద్రకుమార్, కృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.