NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:53 pm Posted by : NAMASTHE BHARAT

ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి

ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి

-కొత్త పథకం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్

-బాచుపల్లిలో ధర్నా.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

-డిమాండ్లు నెరవేరకుంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

బాచుపల్లి, జూలై 1 నమస్తే భరత్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని, దాని స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం బాచుపల్లి మండలంలోని ప్రగతి నగర్ ఏనుగుల బొమ్మ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎర్ర అశోక్ మాట్లాడుతూ, గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, ఇతర బలహీన వర్గాలకు ఉపాధి భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టం దేశంలో అత్యంత కీలకమైన సంక్షేమ చట్టమని అన్నారు. దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన ఈ హక్కును బలహీనపరిచే చర్యలు గ్రామీణ కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. చట్టాన్ని రద్దు చేయడం లేదా కొత్త పథకంతో భర్తీ చేయడం కాకుండా తగిన నిధులు కేటాయించడం, అందరికీ పని కల్పించడం, సకాలంలో వేతనాలు చెల్లించడం, పనిదినాలను పెంచడం వంటి చర్యల ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీపై దాడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని అన్నారు. అదేవిధంగా మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టానికి తగిన నిధులు కేటాయించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, చట్టాన్ని బలహీనపరిచే అన్ని చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.