NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:34 pm Posted by : NAMASTHE BHARAT

శివాలయ నగర్‌లో ఇళ్ల కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్..!

శివాలయ నగర్‌లో ఇళ్ల కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్..!

బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ – రెవెన్యూ అధికారులతో చర్చలు ఫలితం

-అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలపై బస్తీవాసుల్లో ఆందోళన

-ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

-డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ–పోలీసు అధికారులతో చర్చలు

-జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

-తాత్కాలికంగా కూల్చివేతలు నిలిపివేసిన అధికారులు

-అండగా నిలిచిన కూన శ్రీశైలం గౌడ్‌కు బాధితుల కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్, జులై 20 ( నమస్తే భరత్ ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సాయిబాబా నగర్ డివిజన్‌లో ఉన్న శివాలయ నగర్ (సర్వే నంబర్–49)లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల ఇళ్లను రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేస్తున్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోమవారం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి సమస్య వివరాలు తెలుసుకున్న ఆయన, కూల్చివేత పనులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్‌తో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని అధికారులను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మనో చౌదరితో ఫోన్‌లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, శివాలయ నగర్‌లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జోక్యంతో రెవెన్యూ అధికారులు కూల్చివేత చర్యలను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో స్థానిక బస్తీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ, తమ సమస్యపై వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి కూల్చివేతలను నిలిపివేయించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.