NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 12:23 pm Posted by : NAMASTHE BHARAT

జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల జోరు

జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల జోరు

అద్భుత ఎస్సెస్సీ ఫలితాల ప్రభావంతో పెరుగుతున్న విద్యార్థుల చేరికలు

95.2 శాతం ఉత్తీర్ణత సాధించి మరోసారి సత్తా చాటిన పాఠశాల

14 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు

కొత్తగా చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ

స్మార్ట్ క్లాసులు, వృత్తి విద్యా కోర్సులతో ఆకట్టుకుంటున్న పాఠశాల

జీడిమెట్ల, జూన్ 15 ( నమస్తే భరత్ ):
వేసవి సెలవుల అనంతరం జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునఃప్రారంభమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయిని యు. కళ్యాణి తెలిపారు. పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను ప్రధానోపాధ్యాయిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2026 ఎస్సెస్సీ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు 95.2 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని అన్నారు. అంతేకాకుండా 14 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచారని పేర్కొన్నారు. ఈ అద్భుత ఫలితాల ప్రభావం ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్లపై కూడా కనిపిస్తోందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై మరింత విశ్వాసం కనబరుస్తున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యను అందించేందుకు పాఠశాలలో ప్రతి తరగతి గదిని స్మార్ట్ క్లాస్‌రూమ్‌గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అలాగే విశాలమైన ఆట స్థలం, అన్ని సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల కోసం వృత్తి విద్య (వొకేషనల్) కోర్సులు కూడా నిర్వహిస్తున్నామని, విద్యతో పాటు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, ఉత్తమ ఫలితాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయిని యు. కళ్యాణి కోరారు.