విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి


జనసేన విద్యార్థి పోరు దీక్షలో రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్
➤ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శ
➤ విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసి ఒత్తిడి తేవడం సరికాదని హెచ్చరిక
➤ జీఓ నెం.09ను పకడ్బందీగా అమలు చేయాలని జనసేన డిమాండ్
➤ ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్‌కు నివాళులర్పించి దీక్ష ప్రారంభం
➤ విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం
➤ వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాల నేతల సంఘీభావం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన **”జనసేన విద్యార్థి పోరు దీక్ష”**లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బకాయిల పేరుతో విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసి ఒత్తిడి తేవడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. దీక్షకు ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ దీక్షను ప్రారంభించారు. జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ, విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందించలేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆరోపించారు. జీఓ నెం.09ను కచ్చితంగా అమలు చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఓయూ జేఏసీ నాయకుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జనసేనతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ దీక్షకు ఉస్మానియా, కాకతీయ, పాలమూరు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా హాజరై సంఘీభావం తెలిపారు. సాంస్కృతిక బృందం ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దుంపటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, దామోదర్ రెడ్డి, నందగిరి సతీష్, మేకల సతీష్ రెడ్డితో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



