NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:22 am Posted by : NAMASTHE BHARAT

జీడిమెట్లలో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి

జీడిమెట్లలో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి

-చెట్ల కొమ్మల తొలగింపు, ఫుట్‌పాత్ ఆక్రమణల నివారణ, గుంతల మరమ్మతులకు ఆదేశాలు

-పారిశుద్ధ్యం, ఫాగింగ్, వీధి దీపాల నిర్వహణపై అధికారులతో డిప్యూటీ కమిషనర్ సమీక్ష

జీడిమెట్ల, జూలై 8 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల సర్కిల్–55 (QPZ CMC) పరిధిలో ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడంపై డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, నిర్వహణ చర్యల పురోగతిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో సర్కిల్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రహదారుల వెంట ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించడంతో పాటు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే గుర్తించి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘డ్రై డే’ కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని, దోమల వ్యాప్తి నివారణ కోసం ఫాగింగ్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పనిచేయని వీధి దీపాలను తక్షణమే మరమ్మతు చేసి రాత్రి వేళల్లో ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో తలెత్తుతున్న ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన పౌర సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు.