శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, సెప్టెంబర్ 12,శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి NH-44 పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న సయ్యద్ జహీరుద్దీన్ అహ్మద్ (57) శుక్రవారం ఉదయం 11:30 నుండి 11:40 గంటల మధ్య తన నివాసం నుండి తన Ola స్కూటీ (నంబర్ TS 11 EZ 0038) పై షాద్‌నగర్ లోని విధులకు బయలుదేరాడు. శంషాబాద్ పరిధిలోని అగర్వాల్ ఎస్టేట్ సమీపంలో, పాత మదన్‌పల్లి తండాకు సుమారు 200 మీటర్ల దూరంలో NH-44 పై వెళ్తుండగా వెనుక నుండి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టింది.ఢీకొన్న తీవ్రతకు జహీరుద్దీన్ రోడ్డుపై పడిపోగా, తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర రక్తస్రావ గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.సమాచారం అందుకున్న షంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం డ్రైవర్ ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఎస్ ఎచ్ ఓ తెలిపారు.