గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “SAVE WATER – SAVE LIFE” అవగాహన కార్యక్రమం

నమస్తే భరత్ నవంబర్ 7 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: బండ్లగూడ జాగిర్ పీఎన్‌టీ కాలనీ, బి-బ్లాక్, బండ్లగూడ జాగీర్‌లోని గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “SAVE WATER – SAVE LIFE” (నీటిని కాపాడండి – ప్రాణాలను రక్షించండి) అనే నినాదంతో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం మరియు పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వృథా చేయకుండా భవిష్యత్తు తరాల కోసం నీటిని సంరక్షించాలని చిన్నారులు ప్రజలకు సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షహేలా జునైదీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ గ్రాండ్ స్కూల్ చౌరస్తా మీదుగా పీఎన్‌టీ కాలనీ వీధుల గుండా కొనసాగింది. విద్యార్థులు నీటి సంరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ, ప్రజలకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించారు.
నీటిని వృథా చేయకుండా కుళాయిలను అవసరం లేనప్పుడు మూసివేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావించడం వంటి మంచి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో నీటి సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
“నీరు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది… నీటిని కాపాడటం మనందరి బాధ్యత!” అని పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడారు